ఎందుకో... మహర్షికి ముందు నుంచీ ఏదీ కలసి రావడం లేదు. విడుదల తేదీ రెండు సార్లు వాయిదా పడింది. పాటలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. టీజర్ లోనూ దమ్ములేదు. అందరి ఆశలూ ట్రైలర్‌పైనే. ట్రైలర్‌ని అభిమానులకు నచ్చేట్టు కట్ చేయడానికి చిత్రబృందం ఆపసోపాలు పడింది. రెండు వెర్షన్లు రెడీ చేసుకుంది.
అందులో ఒకదాన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విడుదల చేసింది. దాదాపు 150 సెకన్ల పాటు సాగిన ఈ ట్రైలర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌నీ మేళవించడానికి ప్రయత్నించారు. హీరోయిజం, ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఛాలెంజ్ ఇలా ఒక్కటేమిటి అన్నీ చూపించేశారు. మహేష్‌ని మూడు రకాల గెటప్పులలో చూసే అవకాశం దక్కింది.
కాలేజీ విద్యార్థిగా, వ్యాపార వేత్తగా, ఓ రైతుగా కనిపించాడు మహేష్. తన డైలాగ్ డెలివరీలో ఎలాంటి మార్పూ లేదు. అచ్చం శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల్ని చూస్తున్నట్టే అనిపించింది. కాలేజీ సీన్లు హిలేరియస్‌గా సాగబోతున్నాయన్న నమ్మకాన్ని నరేష్ కల్పించాడు. ఇక పూజా రూపంలో గ్లామర్ ఉండనే ఉంది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ బిట్ మాస్‌ని అలరిస్తుందన్న భరోసా దొరికింది. మొత్తానికి పాటలు, టీజర్‌తో విసిగిపోయిన ఫ్యాన్స్‌కి ట్రైలర్‌తో ఊరట దొరికినట్టే. సినిమా కూడా ఇలానే ఉంటే - దిల్‌రాజు చెప్పినట్టు మహేష్ ఫ్యాన్స్ అంతా కాలర్లు ఎగరేసుకుంటూ రావడం ఖాయం.