2022 సంక్రాంతి కాస్త చప్పగానే సాగింది. వస్తాయనుకున్న పెద్ద సినిమాలు హ్యాండిచ్చేయడంతో బంగార్రాజుతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. రౌడీ బాయ్స్, హీరో.. వచ్చినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అయితే 2023 సంక్రాంతి మాత్రం మామూలుగా ఉండబోవడం లేదు. వచ్చే సంక్రాంతికి పెద్ద హీరోలు అప్పుడే కర్చీఫ్ లు వేసేసుకుంటున్నారు. 2023 సంక్రాంతికి మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల సినిమాలు రావడం దాదాపుగా ఫిక్సయ్యింది.
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రబృందం ముందే చెప్పేసింది. శంకర్ సినిమాలు అనుకున్న సమయానికి రావడం కష్టం.కాకపోతే అక్కడ ఉన్నది దిల్ రాజు. ఆయనకు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. ఎలాగైనా సరే.. చెప్పిన టైమ్ కి సినిమాని ముగించాలనుకుంటారు. సో.. చరణ్ సినిమా సంక్రాంతికి రావడం పక్కా.
మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం పట్టాలెక్కబోతోంది. అతడు, ఖలేజా తరవాత రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. హ్యాట్రిక్ కాంబో కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ లో షూటింగ్ మొదలెడతారు. 2023 సంక్రాంతికి రావాలన్నది వీళ్ల టార్గెట్. అల్లు అర్జున్ కూడా సంక్రాంతికే గురి పెట్టాడు. అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. పుష్ప 2 షూటింగ్ అవ్వగానే.. బోయపాటికి కాల్షీట్లు ఇవ్వబోతున్నాడు బన్నీ. ఈ సినిమాని 2023 సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్. సో... వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర యుద్ధమే అన్నమాట.