మన హీరోలకెల్లా అందగాడు మహేష్‌బాబు. ఈ విషయంలో ఎవరికీ సెకండ్ ఒపీనియన్ లేదు. వయసు పెరిగేకొద్దీ.. తన వన్నె కూడా పెరుగుతూ వెళ్తోంది. అందుకే కథానాయికలు సైతం మహేష్ తో నటించడానికి పోటీ పడుతుంటారు. మహేష్ పక్కన హీరోయిన్ గా నటించే ఆఫర్ వస్తే.. స్టార్ హోదా దక్కేసినట్టే. అందుకే మహేష్ సినిమా అనేసరికి... హీరోయిన్లంతా క్యూ కడతారు. అయితే.. సాయి పల్లవి మాత్రం అలాంటి ఆఫర్ వచ్చినా - ఓకే చెప్పడానికి సతమతమవుతోంది. ఎందుకంటే ఈ సినిమాలో తనకు ఛాన్స్ వచ్చింద మహేష్ పక్కన హీరోయిన్ గా కాదు. సోదరిగా.
అవును.. మహేష్‌కి సోదరిగా సాయి పల్లవికి ఆఫర్ వచ్చింది. అయితే దాన్ని ఓకే చేయాలా? వద్దా? అనే సందిగ్థంలో పడింది సాయిపల్లవి. మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే ఎంపికైంది. అయితే ఈ సినిమాలో హీరో చెల్లాయి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఆ పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తే బాగుంటుందన్నది త్రివిక్రమ్ ఆలోచన. అందుకే సాయి పల్లవిని సంప్రదించారు. త్రివిక్రమ్ - మహేష్ కాంబో అంటే కాదనేది ఏముంది? కానీ మహేష్ పక్కన చెల్లాయిగా నటించడమే ఇబ్బంది. ఒకసారి చెల్లాయి పాత్రకు ఫిక్సయిపోతే, మళ్లీ హీరోయిన్ గా మహేష్ పక్కన కనిపించే ఛాన్స్ రానట్టే. అందుకే సాయి పల్లవి.. ఈ సినిమా ఓకే చేయడంలో తటపటాయిస్తోందట. `భోళా శంకర్`లోనూ సాయిపల్లవికి ఇలాంటి ఆఫరే వచ్చింది. చిరు చెల్లాయిగా నటించమంటే కాదని చెప్పింది. మరి ఈసారి ఏం చేస్తుందో?