సూపర్ స్టార్ కృష్ణ.. ఇప్పుడో చరిత్ర. కాలం ఒడిలో ఆయన కలిసిపోయారు. ఇప్పుడు జ్ఞాపకాలే మిగిలి ఉన్నాయి. అయితే కృష్ణ చరిత్రని అంత తేలిగ్గా మర్చిపోకూడదు. తరతరాలు గుర్తుంచుకోవాలి. అందుకు కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఏం చేయబోతున్నారు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. కృష్ణ అంత్యక్రియలు బుధవారం మహాప్రస్థానంలో ముగిశాయి. ఇప్పుడు కృష్ణ జ్ఞాపకార్థం మహేష్ ఓ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. అందుకోసం హైదరాబాద్ లోని పద్మాలయా స్టూడియోస్ ని మహేష్ వేదిక చేసుకోబోతున్నాడని టాక్.
కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో నిర్వహించడం పట్ల.. అభిమానులు కాస్త అంతృప్తితో ఉన్నారు. సాధారణంగా స్టార్ హీరోలు చనిపోయినప్పుడు... సొంత స్థలాలలో అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలా అంత్యక్రియలు నిర్వహించిన చోట.. ఓ జ్ఞాపక స్థూపం నిర్మించి - సందర్శకులు, అభిమానులు చూడడానికి వెసులుబాటు కల్పిస్తుంటారు. కృష్ణకు ఫామ్ హౌస్ కూడా ఉంది. అందులో.. అంత్యక్రియలు నిర్వహిస్తే బాగుండేది. కానీ... రమేష్ బాబు, ఇందిర దేవిల అంత్యక్రియలు మహాప్రస్థానంలోనే జరగడం వల్ల.. మహేష్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఏదేమైనా కృష్ణ జ్ఞాపకాలు సుస్థిరంగా నిలిచిపోవడానికి మహేష్ ఏదో ఒకటి చేయాలి. అప్పుడే కృష్ణకు ఘన నివాళి అందించినట్టు అవుతుంది. మరి మహేష్ మనసులో ఏముందో..?