దర్శకుడు కొరటాల శివకి సామాజిక బాధ్యత ఎక్కువ. రాజకీయాలపై ఆయనకు అవగాహన ఇంకా ఎక్కువ. ప్రస్తుత రాజకీయాలపై సోషల్ మీడియా వేదికగా సునిశిత విమర్శలు చేయడంలో ఆయన తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. సినిమాల్లోనూ కొరటాల శివ హీరో పాత్రల్ని తీర్చిదిద్దే వైనం చాలా ప్రత్యేకం.
మహేష్‌తో ఆయన రూపొందిస్తున్న 'భరత్ అను నేను' పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమానే. ఇందులో హీరో మహేష్‌బాబు, ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. ఇప్పటిదాకా ఈ అంశం గాసిప్ మాత్రమే. ఇప్పుడది అధికారికం. ఎందుకంటే, ఫస్ట్ లుక్‌తోపాటు, ఓ ఆడియో బైట్ కూడా విడుదల చేశారు - అందులో మహేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు వాయిస్ విన్పించింది. ఇంకో వైపున 'భరత్ అను నేను' టైటిల్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు.
బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తొలిసారిగా తెలుగులో నటిస్తోన్న సినిమా ఇది. ప్రస్తుత రాజకీయాలపై కమర్షియల్ పంథాలోనే దర్శకుడు కొరటాల శివ సంధిస్తున్న అస్త్రంగా 'భరత్ అను నేను' సినిమా గురించి చెప్పుకోవచ్చు. మహేష్ గతంలోనూ పొలిటికల్ లీడర్‌గా నటించాడు. 'దూకుడు' సినిమాలో తండ్రి కోసం ఎమ్మెల్యే గెటప్‌లో కన్పిస్తాడంతే. ఈసారి మాత్రం రాజకీయ నాయకుడిగా మహేష్‌ని పూర్తిస్థాయిలో చూసే అవకాశం ఉంది.
కొరటాల శివ ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్‌లే. అన్నిట్లోనూ మంచి మెసేజ్ కన్పిస్తుంది. ఒకదాన్ని మించి ఇంకోటి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాల్ని అందుకున్నవే. ఈసారి కూడా అంతకు మించిన కమర్షియల్ విజయం కొరటాల శివ నుంచి వస్తుందని ఆశించడంలో వింతేమీ లేదు. 150 కోట్లపైనే ప్రీ రిలీజ్ బిజినెస్‌ని అంచనా వేస్తున్నారు ఈ సినిమా గురించి టాలీవుడ్ ట్రేడ్ పండితులు.