తెలుగు రాజకీయాల్లో 'భరత్ అను నేను' సినిమా సంచలనం సృష్టించబోతోంది. వసూళ్ళ పరంగా, ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగానే కాదు, పొలిటికల్ అంచనాల పరంగా కూడా! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా సూపర్ స్టార్ మహేష్‌బాబు 'భరత్ అను నేను' సినిమాలో నటించబోతోన్న సంగతి తెల్సిందే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అంటే, ఈ సినిమాలో ఎలాంటి సంచలనాలు వుంటాయోననే అనుమానాలు తలెత్తడం సహజమే. పైగా 'ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల విషయం'లో ఏకంగా ప్రధాని నరేంద్రమోడీనే ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు దర్శకుడు కొరటాల శివ. దాంతో, 'భరత్ అను నేను' సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నకొద్దీ సినిమాపై రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతూ వస్తోంది. 'భరత్' సినిమాలో ఏముంటుందోనని ఇప్పుడు రాజకీయ ప్రముఖులూ చర్చించుకుంటున్నారట.
మహేష్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కి స్వయానా బావమరిది. దాంతో సినిమా కొంత మేర టీడీపీకి అనుకూలంగా వుండొచ్చని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే సినిమాలో రాజకీయ అంశాలు వుండబోతున్నాయన్న మాట వాస్తవమే అయినా, ఆ రాజకీయ అంశాలు ఏ పార్టీకీ సంబంధం వుండవని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది. అయినాగానీ తెలంగాణ ఉద్యమం సహా అనేక అంశాలకు సంబంధించి 'భరత్ అను నేను' సినిమాలో లైటర్ వీన్‌గా అయినా సన్నివేశాలుంటాయన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.