సూపర్ స్టార్ మహేష్‌బాబు తన ‘సూపర్’ మనసుని చాటుకున్నాడు ఇంకోసారి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకూ చెరో యాభై లక్షల చొప్పున మొత్తంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం విదితమే. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ విరాళాన్ని అందించనున్నాడు మహేష్. ఇదిలా వుంటే, సినిమా కార్మికుల కోసం తాజాగా 25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు ఈ సూపర్ స్టార్. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతుండడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయారనీ, వారిని ఆదుకోవడం తమ బాధ్యత అని చెబుతూ మహేష్, సోషల్ మీడియా వేదికగా తాను 25 లక్షల విరాళం అందించనున్నట్లు ప్రకటించాడు.
మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే పలువురు హీరోలు తెలుగు రాష్ట్రాలకూ, కేంద్రానికీ విరాళాలు ప్రకటించగా, చిరంజీవి సినీ కార్మికుల కోసం ప్రత్యేకంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం విదితమే. అల్లరి నరేష్ తదితరుల కూడా సినీ కార్మికులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో, సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వారికి సినీ ప్రముఖుల నుంచి ప్రకటితమవుతున్న విరాళాలు కొంత ఊరట కల్పిస్తాయని నిస్సందేహంగా చెప్పొచ్చు.