ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయ నిర్మల గారి హఠాన్మరణం అటు తెలుగు సినీ పరిశ్రమను.. ఇటు ఘట్టమనేని అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పురుషాధిక్యంతో ముందుకు దూసుకుపోతున్న తెలుగు పరిశ్రమలో స్త్రీలు కూడా ఏం తక్కువ కాదు అని చెబుతూ అగ్ర కథానాయకులతో వరుస చిత్రాలకు దర్శకత్వం వహించి సుమారు 40కు పైగా చిత్రాలను తెరకెక్కించి ఎందరో స్త్రీలకు స్ఫూర్తిదాతగా నిలిచింది విజయ నిర్మల. ఏడు పదులకు పైగా వయసులో కూడా చురుగ్గా ఉండే ఈవిడ ఒక్కసారిగా కన్ను మూయడం ఇటు కృష్ణ గారిని, అటు మహేష్ మరియు ఘట్టమనేని అభిమానులను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యేలా చేసింది.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేష్ తాజా చిత్రం మహర్షి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర బృందం 50 రోజుల వేడుక నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. కానీ విజయ నిర్మల గారి విషాదం తరువాత, నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సంస్థ ఆ వేడుకను వాయిదా వేస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించారు. అది చూసిన మహేష్ అభిమానులు దిల్ రాజుని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు.
ఓ పక్క మహేష్ కుటుంబం మరియు అభిమానులంతా శోక సంద్రం లో మునిగిపోయి ఉంటే..ఇలాంటి వేడుకలు రద్దు చేయాలి కానీ వాయిదా వేయడం ఏంటి అని మండిపడ్డారు. మరణానంతరం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యి కుటుంబ సభ్యులు, అభిమానులు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అప్పటికల్లా మహర్షి ఫుల్ రన్ పూర్తవుతుంది కాబట్టి.. అప్పుడు ఈ వేడుక చేసినా ఉపయోగం ఉండదు, కాబట్టి రద్దు చేసి ఉంటే బావుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.