సూపర్ స్టార్ అంటే తెలుగులో కృష్ణ అని అందరికీ తెలుసు. నయా సూపర్ స్టార్ మహేష్‌బాబు, తన తండ్రి లెగసీని కొనసాగిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్‌గా సత్తా చాటుతున్నారు. ముచ్చటగా మూడో తరం కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే సినిమాల్లో నటించేసిన మహేష్ తనయుడు గౌతమ్, అతి త్వరలో హీరోగా కూడా తెరంగేట్రం చేసేస్తాడేమో! ఏమో, ఏంటి? చేసెయ్యాలంతే! ఫొటోలు మాటలు చెప్పేస్తాయ్ అనడానికి ఈ ఫొటోనే ఓ ఉదాహరణ.
నెత్తిన క్యాప్‌తో మహేష్ నవ్వుతూ కన్పిస్తోంటే, కాన్ఫిడెంట్‌గా 'నాన్న'కి ఏవేవో విషయాలు వల్లిస్తూ ఉన్నాడు గౌతమ్. '1 నేనొక్కడినే' సినిమాలో 'తండ్రితో పోటీ పడి నటించాడు' అనేంతలా దర్శకుడు సుకుమార్ నుంచి ప్రశంసలు అందుకున్నాడీ బుడతడు. మహేష్ కూడా ఒకప్పుడు బాల నటుడిగా పలు సినిమాల్లో నటించాడు. తండ్రి కృష్ణతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి అప్పట్లో మహేష్ సంపాదించిన పేరు ప్రఖ్యాతులు తక్కువేం కాదు. లైక్ ఫాదర్ లైక్ సన్ - అవును, తండ్రి కృష్ణలా మహేష్, తండ్రి మహేష్‌లా తనయుడు గౌతమ్ తెలుగు తెరపై సమీప భవిష్యత్తులో సృష్టించే సంచలనాల గురించి ఇప్పుడే కథలు కథలుగా చెప్పేసుకుంటున్నారు.
ఒమన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసినప్పటి ఫొటో ఇది. షూటింగ్ స్పాట్లో చిన్నప్పుడు మహేష్ ఎంత యాక్టివ్‌గా ఉండేవాడోగానీ, గౌతమ్ మాత్రం చాలా హైపర్ యాక్టివ్ అట. '1 నేనొక్కడినే' దర్శకుడు సుకుమార్ ఆ విషయాల్ని వెల్లడిస్తోంటే, ఆ విషయాల్ని వింటూ మహేష్ పొందిన పుత్రోత్సాహాన్ని మాటల్లో అభివర్ణించలేం. తెరపై ఇంకా మహేష్, అమ్మాయిల కలల రాకుమారుడే. మహేష్ వయసెంత? మహా అయితే ఓ పాతికేళ్ళుంటుందేమో అనిపిస్తుంటుంది. అలాంటిది మహేష్ తనయుడూ హీరో అయిపోతే? చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇస్తేనో ఆ కిక్కు ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చెయ్యక తప్పదు.