ఓవర్సీస్ బిజినెస్ అనేది.. చాలా కీలకంగా మారిపోయింది. స్టార్ సినిమా అనేసరికి.. కోట్లకు కోట్లు పోసి కొంటున్నారు. మొత్తం వ్యాపారంలో దాదాపు 20 శాతం ఓవర్సీస్ దగ్గరే జరిగిపోతోంది. మహేష్‌బాబు, ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరోల సినిమాల విషయంలో ఓవర్సీస్ బయ్యర్లు ఓ అడుగు ముందే ఉంటారు. సినిమా విడుదల తేదీ ఖరారు కాగానే... రైట్స్ కోసం పోటీ పడుతుంటారు.
అయితే మహేష్ బాబు సినిమా మహర్షికి మాత్రం అక్కడి నుంచి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. మే 9న ఈ సినిమా విడుదల అవుతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేశారు. తొలి పాటని కూడా విడుదల చేశారు. ఉగాదికి టీజర్ వచ్చేస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఓవర్సీస్ బిజినెస్ పూర్తికాలేదు. మహేష్ బాబు సినిమా అంటే ముందే ఎగరేసుకుపోయే ఓవర్సీస్ బయ్యర్లు ఈ సినిమా విషయంలో మాత్రం ఆచి తూచి అడుగులేస్తున్నారు.
ఈ సినిమాకి నిర్మాతలు ఏకంగా 18 నుంచి 20 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతేసి రేట్లు పోసి కొనడానికి బయ్యర్లు సిద్దంగా లేరు. ఒకరిద్దరు 15 కోట్ల వరకూ వచ్చి ఆగిపోయారట. అయితే ఈ అంకెని తగ్గించడానికి మహర్షి నిర్మాతలు సిద్దంగా లేకపోయే సరికి.. ఓవర్సీస్ బేరం ఎప్పటికీ తెగట్లేదు. ఒకవేళ ఈ సినిమాని ఎవ్వరూ కొనకపోతే.. నిర్మాతలే సొంతంగా విడుదల చేసుకోవాల్సివస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.