టాలీవుడ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు - రాజమౌళి. చాలా ఏళ్లుగా.. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని వార్తలొస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ కాంబో సెట్టయ్యింది కూడా. `సర్కారు వారి పాట` తరవాత.. మహేష్ చేయబోయే సినిమాకి రాజమౌళినే దర్శకుడు. ఆర్.ఆర్.ఆర్ తరవాత... రాజమౌళి మహేష్ తోనే సినిమా చేస్తాడు. ఇది ఫిక్స్.
అయితే... వీరిద్దరూ కలిస్తే ఎలాంటి సినిమా బయటకు వస్తుంది? అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోందిప్పుడు. వీరిద్దరి కాంబోలో `జేమ్స్ బాండ్` తరహా సినిమా వస్తుందన్న ఊహా గానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు మరో సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథ సిద్ధం చేసేశాడని టాక్. జోనర్ ఏమిటన్న విషయంలోనూ లీకులు మొదలైపోయాయి. ఈ కథ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగబోతోందట.
దట్టమైన అటవీ నేపథ్యంలో సాగే కథ ఇదని, ఇది వరకు ఇలాంటి జోనర్ ని టాలీవుడ్ టచ్ చేయలేదని తెలుస్తోంది. ఈ సినిమాకీ విజువల్ ఎఫెక్ట్స్ కీలకమని సమాచారం. కనీసం ఈ సినిమా రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకోబోతోందని సమాచారం అందుతోంది. రాజమౌళి ఏ సినిమా చేసినా.. కనీసం రెండేళ్లయినా పట్టాల్సిందే. మహేష్ కూడా తన రెండేళ్ల కాల్షీట్లు రాజమౌళికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. సో.. ఇంకేముంది? మరో క్రేజీ క్రేజీ ఇండియన్ మూవీకి రాజమౌళి తెర తీసినట్టే.