భారత చలన చిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జయంతిని పురస్కరించుకుని ప్రతీ ఏడాది ఉత్తమ నటీనటులకు అవార్డు ల ప్రధానోత్సవం జరుగుతుంది. 150వ జయంతి సందర్భంగా, ఎప్పుడూ ఢిల్లీ, ముంబయ్‌లలో జరిగే ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం మొట్ట మొదటి సారిగా హైద్రాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు దక్షిణాది నుండి పలువురు సినీ ప్రముఖులు, టెక్నీషియన్లు హాజరయ్యారు.
తెలంగాణా గవర్నర్ తమిళ సై ముఖ్య అతిధిగా విచ్చేశారు. 'భరత్ అనే నేను' సినిమాకి గాను మహేష్‌బాబుకు ఉత్తమ నటుడు అవార్డ్ లభించింది. మహేష్‌బాబు ఈ కార్యక్రమానికి హాజరు కాని కారణంగా ఆయన భార్య నమ్రతా శిరోడ్కర్, గవర్నర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విలక్షణ నటుడు మోహన్‌బాబుకు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. బెస్ట్ డెబ్యూ అవార్డును పాయల్ రాజ్‌పుత్ అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డు దక్కించుకున్నారు 'రంగస్థలం' సినిమాకి గాను.
ఉత్తమ నటి అవార్డు 'మహానటి' సినిమాకి కీర్తిసురేష్ దక్కించుకుంది. ఎన్ కన్వెన్షన్‌లో ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో దక్షిణాది చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆ అభివృద్ధిని కొనసాగించేలా మరిన్ని మంచి సినిమాలు రావాలని ఆమె ఆకాంక్షిస్తూ ఆమె ప్రసంగించారు.