కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. ఈ సినిమాకి 'భరత్ అను నేను' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో మహేష్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. ఒకటి బిజినెస్ మేన్‌గానూ, రెండోది పొలిటీషియన్‌గానూ కనిపిస్తాడట. పొలిటీషియన్ అంటే ఏదో ఎమ్మెల్యేగా కనిపిస్తాడేమో అని అందరూ అనుకున్నప్పటికీ, ముఖ్యమంత్రిగా మహేష్ కనిపించబోతున్నాడనే గాసిప్స్ తాజాగా తెరపైకొచ్చాయి. అదే నిజమైతే ఈ సినిమా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం కానుంది. మహేష్ ఇప్పటివరకు రాజకీయాలెక్కడా మాట్లాడలేదు. కానీ ఆయన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ మాత్రం కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కలిగి ఉండేవారు. మహేష్ బావ గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో మహేష్ పేరుని గల్లా జయదేవ్ బాగా వాడుకున్నారు. ఏదేమైనా రాజకీయం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే సెటైర్లు తప్పవు. ముఖ్యమంత్రి పాత్ర అంటే రాజకీయంగా చిక్కులూ తప్పకపోవచ్చు. మరి మహేష్ ఏం చేస్తాడో గానీ, 'భరత్ అను నేను' అనే టైటిల్ బయటికి వచ్చినప్పట్నుంచీ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా మహేష్ పాత్ర గురించి వస్తున్న గాసిప్స్‌తో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. మరో పక్క మురుగదాస్ - మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'స్పైడర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆగష్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.