ఇప్పుడు హీరోలందరూ పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు. తమ సినిమాని హిందీలో కూడా విడుదల చేసుకోవాలని, ఆ రూపంలో... వసూళ్ల వర్షం కురిపించుకోవాలని, తమ మార్కెట్ ని పెంచుకోవాలని అనుకుంటున్నారు. పుష్ప హిట్టుతో... బాలీవుడ్ ఆశలు మరింతగా పెరిగాయి. బాలీవుడ్ సైతం మన హీరోల సినిమాలపై దృష్టి పెట్టింది. హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం క్యూ కడుతోంది. స్టార్ హీరో సినిమా ఒకటి రెడీ అవుతోందంటే, బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల `పుష్ప` డబ్బింగ్ రైట్స్ ని హిందీ వాళ్లు రూ.30 కోట్లకు కొన్నారు. అక్కడ ఆ సినిమా ఏకంగా రూ.70 కోట్ల వరకూ సాధించింది. అందుకే తెలుగు సినిమాలపై వాళ్లకు మరింత గురి ఏర్పడింది. చిరంజీవి `ఆచార్య`ని సైతం మంచి రేటుకి కొన్నారని టాక్. ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడుపోయాయట.
ఇప్పుడు `సర్కారు వారి పాట` విషయానికొద్దాం. ఈసినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ డీల్ పూర్తయ్యింది. రూ.15 కోట్లకు హిందీ రైట్స్ అమ్మారని టాక్. మహేష్ సినిమాకి రూ.15 కోట్లంటే చాలా తక్కువనే చెప్పాలి. గోపీచంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లాంటి వాళ్ల సినిమాలకు హిందీ శాటిలైట్ ద్వారా రూ.10 నుంచి 12 కోట్ల వరకూ వస్తోంది. బన్నీ సినిమా రూ.30 కోట్లకు, చిరు సినిమా 25 కోట్లకు అమ్మినచోట.. మహేష్ సినిమా పట్టుమని 20 కోట్లు కూడా తెచ్చుకోకపోవడం వింతగా అనిపిస్తోంది. మహేష్ పాన్ ఇండియా సినిమాలవైపు, కథలవైపు ఆసక్తి చూపించడం లేదని, ఒకవేళ హిందీలో ఈ సినిమా కొన్నా, మహేష్ ప్రచారానికి రాడని ఉప్పు అందడంతో... ఈ సినిమా రైట్స్ పై ఎవరూ దృష్టి పెట్టలేదని టాక్.