ఎట్టకేలకు సర్కారు వారి పాట షూటింగ్ సమయం ఆసన్నమైంది. అనేక వాయిదాల తరవాత... సర్కారు వారి పాటకు గంట కొట్టడానికి రెడీ అవుతోంది చిత్రబృందం. ముందు ఈ సినిమా షూటింగ్ ని అమెరికాలో మొదలెడదామనుకున్నారు. కానీ వీసాల సమస్యతో కుదర్లేదు. ఆ అమెరికా షెడ్యూల్ మొత్తం హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. అయినా షూటింగ్ మొదలు కాలేదు.
ఇప్పుడు దుబాయ్‌లో సర్కారు వారి పాట కి క్లాప్ కొట్టనున్నారు. ఈనె 26 నుంచి.. దుబాయ్ లో సర్కారు వారి పాట షూటింగ్ మొదలు కానుంది. ఈరోజో, రేపో... మహేష్ దుబాయ్ లో ల్యాండ్ అవ్వబోతున్నాడు. అక్కడ 20 రోజుల పాటు షూటింగ్ జరగబోతోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది దసరా నాటికి ఈ సినిమా చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. దుబాయ్ నుంచి రాగానే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ఉంటుంది. ఆ తరవాత.. అమెరికా షెడ్యూల్ మొదలవుతుంది. ఈ మూడు షెడ్యూళ్లతోనే సినిమా పూర్తి చేయాలని ప్లాన్.