చిత్రసీమ ఎన్నో సంచలనాలకు నెలవు. ఎప్పుడు ఎలాంటి సంచలనమైన కాంబినేషన్ సెట్ అవుతుందో చెప్పలేం. ఇప్పుడు అలాంటి ఓ కాంబినేషన్ ... హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్.. పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌ల కోసం ఓ కథ రెడీ చేస్తున్నాడని, ఈ మల్టీస్టార్ త్వరలోనే పట్టాలెక్కే ఛాన్సుందని ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. పవన్ తో సినిమా చేయాలని చరణ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కనీసం తాను నిర్మాతగా ఓ సినిమా తీయాలని.. తన ప్లానింగ్.
పవన్ కూడా చరణ్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ పతాకంపై చరణ్ హీరోగా ఓ సినిమా చేయాలని, గత కొన్నాళ్లుగా కథ కోసం అన్వేషిస్తున్నాడు. అయితే.. చరణ్, పవన్.. ఇద్దరికీ తగిన కథని శంకర్ సెట్ చేయడం.. ఈ మల్టీస్టారర్‌కి రంగం సిద్ధం చేస్తుండడంతో పవన్, చరణ్‌ల పని సులభం అవ్వబోతోంది. శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 బిజీగా ఉన్నాడు. ఆ తరవాతే... ఈ కాంబో ఉంటుంది. అయితే.. శంకర్ పై ఇది వరకు చాలా గాసిప్పులు వచ్చాయి. మహేష్ తో శంకర్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. చివరికి అది గాలి వార్తగా మిగిలిపోయింది. మరి ఇదేం అవుతుందో?