మహేష్ బాబు `మహర్షి`కి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాకి రూ.130 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అయితే... నిర్మాతలకు మాత్రం ఒక్కపైసా లాభం రాలేదు. టేబుల్ ప్రాఫిట్‌తో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా రూ.10 కోట్ల డెఫిషీట్‌తో విడుదల అవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనంతటికీ కారణం ఎవరు? విడుదలైన తరవాతైనా నిర్మాతలు లాభాల్ని కళ్ల చూస్తారా? అనేవి ఇప్పుడు రేగుతున్న అనుమానాలు, ప్రశ్నలు. మహేష్ బాబు `మహర్షి` సినిమాని రూ.100 కోట్లతో ముగించాలన్నది నిర్మాతల ఉద్దేశం.
నిజానికి అనుకున్న బడ్జెట్‌లో ఈ సినిమా పూర్తయితే.. ఇప్పటికి 30 కోట్ల లాభాలు నిర్మాతలకు దక్కేవి. కానీ... బడ్జెట్ అంతకంతకూ పెరుగుతూ వెళ్లింది. షూటింగ్ ఆలస్యం అవ్వడం, రీషూట్లతో విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో వడ్డీలు పెరిగిపోయాయి. ఎలా చూసినా బడ్జెట్ రూ.130 నుంచి రూ140 కోట్లకు తేలింది. బిజినెస్ లెక్కలన్నీ వేస్తే దాదాపు ఆరు కోట్ల టేబుల్ లాస్‌తో ఈ సినిమా విడుదల అవుతోంది.
ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధిస్తే తప్ప నిర్మాతలకు డబ్బులు రావు. ముందు ఈ సినిమా కొన్న బయ్యర్లు బయటపడాలంటే దాదాపు గా 170 కోట్లు వసూలు చేయాలి. ఆ తరవాతే... నిర్మాతలకు లాభాలొస్తాయి. మరి ఇదంతా జరిగే పనేనా? అనిపిస్తోంది. భరత్ అనే నేను రూ.150 కోట్ల మార్క్ దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేస్తే తప్ప ఈ అంకెలు అందుకోవడం కష్టం.