సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఈ సారి గెటప్‌లో ప్రయోగం చేయబోతున్నాడనే టాక్ గత కొంత కాలంగా వినిపిస్తోంది. గెడ్డాలు, మీసాలతో న్యూ లుక్‌లో మహేష్ కనిపించబోతున్నాడట తన కొత్త చిత్రం కోసం. 'భరత్ అనే నేను' సినిమా తర్వాత వంశీ పైడిపల్లి చిత్రంలో మహేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసమే మహేష్ తన లుక్ ఛేంజ్ చేయబోతున్నాడట. అది కూడా మహేష్ ఇంతవరకూ కనిపించని లుక్ అన్న మాట. ఈ మధ్య మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నుండి, యంగ్ హీరో రామ్ దాకా చాలా మంది హీరోలు గుబురు గెడ్డాలు ట్రై చేసేశారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కి ఈ గెడ్డం బా..గా.. కలిసొచ్చేసింది 'రంగస్థలం'తో. కొంత మంది హీరోలకు దురదృష్టం రూపంలో వెంటాడింది. ఇక ఇప్పుడు మహేష్ సంగతి ఏంటో కానీ, ఇంతవరకూ ఇలాంటి ప్రయోగాల జోలికి ఎప్పుడూ వెళ్లని మహేష్‌కి కూడా గెడ్డంతో ప్రయోగం చేయక తప్పలేదట.
'భరత్ అనే నేను' సినిమా తర్వాత ఫ్యామిలీతో కొంత కాలం విదేశాల్లో ఎంజాయ్ చేసిన మహేష్ ఇండియాకు తిరిగొస్తూ, ముంబయ్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాకు చిక్కాడు. ఆ ఫోటోతోనే మహేష్ లుక్ రివీల్ అయిపోయిందన్న మాట. ఇక్కడే చిన్న ట్విస్ట్. ఇదేం ఫైనల్ లుక్ కాదట. అసలు లుక్ మరోటి ఉందట. ఆ లుక్ అయితే రివీల్ అయ్యే ఛాన్సే లేదంటోంది చిత్ర యూనిట్.
ఇకపోతే మహేష్‌కి 25వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'రాజసం' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. పూజా హెగ్దే సూపర్‌స్టార్‌కి జోడీగా నటిస్తోందీ సినిమాలో.