అర్జున్‌రెడ్డితో సంచలనం సృష్టించాడు సందీప్‌రెడ్డి వంగా. ఆ తరవాత తనకు చాలా అవకాశాలొచ్చాయి. కానీ... ఏదీ సరైన రీతిలో సెట్ కాలేదు. సందీప్ - మహేష్ కాంబినేషన్‌లో సినిమా దాదాపు ఖాయం అనుకున్నారు. కానీ.. అది డ్రాప్ అయిపోయింది. ఆ తరవాత... మరో పెద్ద సినిమా సెట్ కాలేదు. అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లోనే తీసుకుని, అక్కడా హిట్టు కొట్టాడు. ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నాడు. అయితే సందీప్ కి ప్రభాస్ నుంచి పిలుపొచ్చింది. ప్రభాస్ 25వ సినిమాకి తనే దర్శకుడన్న ప్రచారం జరుగుతోంది.
ఈనెల 7న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండొచ్చు. అయితే సందీప్ ప్రభాస్‌కోసం కొత్త కథేమీ రాసుకోలేదు. ఆల్రెడీ ఉన్న కథనే ప్రభాస్ తో తీస్తున్నాడట. మహేష్ కి చెప్పిన కథనే ప్రభాస్ కీ వినిపించాడని, ఈసారి ప్రభాస్ ఓకే చెప్పాడని సమాచారం. నిజానికి అర్జున్ రెడ్డి కంటే ముందు ఈ కథనే సినిమాగా తీద్దాం అనుకున్నాడు సందీప్. కానీ ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ.
తొలి సినిమాకే అంత రిస్క్ ఎందుకని... ఆ కథ పక్కన పెట్టాడు. ఇప్పుడు ప్రభాస్ తో కమిట్ అయ్యాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని తెలుస్తోంది.