ఉంటే సెట్లో... లేదంటే ఇంట్లో... ఇదీ మహేష్ బాబు షెడ్యూల్. అటు సినిమాలు, ఇటు ఎండార్స్మెంట్లు, మధ్యలో.. వ్యాపారం అంటూ తీరక లేకుండా గడుపుతుంటాడు మహేష్. ఎంత బిజీగా ఉన్నా, కుటుంబానికి సమయం కేటాయించడం మాత్రం మర్చిపోడు. కాస్త ఖాళీ దొరికినా చాలు, ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ వేసేస్తుంటాడు. కనీసం మూడు నెలలకు ఓసారి ఫారెన్ ట్రిప్ వేయడం మహేష్‌కి అలవాటు. వేసవి వచ్చిందంటే మహేష్ ఇండియాలో ఉండడు. అయితే ఈసారి మాత్రం మహేష్ ఇండియాలోనే ఉంటున్నాడు.
తన కుటుంబంతో కలిసి సరదాగా హిమాలయాలకు వెళ్లబోతున్నాడట. సరిలేరు నీకెవ్వరు తరవాత అనుకుండా కాస్త గ్యాప్ దొరికింది మహేష్‌కి. వంశీ పైడి పల్లి సినిమా లేకపోవడంతో విరామం లభించింది. దాన్ని సద్వినియోగ పరచుకుందామనుకుంటున్నాడు. అందుకే కుటుంబంతో కలసి హిమాలయాలకు వెళ్లబోతున్నాడట. తిరిగి వచ్చాక చిరంజీవి 152వ సినిమా షూటింగ్లో పాలుపంచుకుంటాడని టాక్. మరోవైపు పరశురామ్ కూడా మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడు. మహేష్ తిరిగొచ్చేలోగా ఆ కథ కూడా రెడీ అయిపోతుంది.