త్రివిక్ర‌మ్ కోసం మ‌హేష్ ఆరాటం.

By Gowthami - April 07, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

త‌న త‌దుప‌రి సినిమాపై ఎటూ తేల్చుకోలేక‌పోతున్నాడు మ‌హేష్ బాబు. వంశీ పైడిప‌ల్లితో సినిమా అర్థాంత‌రంగా ఆగిపోవ‌డంతో స‌మ‌స్య మొద‌లైంది. ఆ త‌ర‌వాత చాలామంది ద‌ర్శ‌కుల పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. అయితే.. క‌థ‌లే సెట్ అవ్వ‌లేదు. ఆచార్య‌లో మ‌హేష్ ఓ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అదీ తేల‌లేదు. ఎట్ట‌కేల‌కు ప‌ర‌శురామ్ ఓకే అయ్యాడు. అయితే ఈ క‌థ‌ని మ‌హేష్ అన్య‌మ‌న‌స్కంగానే ఒప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికీ మ‌హేష్ త‌న ప్ర‌యత్నాలు మాన‌లేద‌ని, ప్ర‌త్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నాడ‌ని స‌మాచారం.

 

మ‌హేష్ దృష్టి ఇప్పుడు త్రివిక్ర‌మ్‌పై ప‌డింద‌ట‌. వీరిద్ద‌రిదీ సూప‌ర్ హిట్ కాంబినేష‌న్. అంత‌కు మించి మంచి అనుబంధం ఉంది. త్రివిక్ర‌మ్‌తో మ‌హేష్‌సినిమా రాబోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇద్ద‌రికీ క‌లిసి ప‌నిచేసే స‌మ‌య‌మే ద‌క్క‌డం లేదు. త్రివిక్ర‌మ్ త‌దుప‌రి చిత్రం ఎన్టీఆర్ తో ఖరారైంది. ఈ వేస‌విలోనే ఈ సినిమా మొద‌లవ్వాలి. అయితే `ఆర్‌.ఆర్‌.ఆర్‌` షూటింగ్ ఆల‌స్యం అవుతుండ‌డంతో... ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా కూడా ఆల‌స్యంగానే ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈలోగా త‌న‌తో సినిమా చేసే వీలుందేమో అన్న‌ది మ‌హేష్ ఆలోచ‌న‌. ఎన్టీఆర్ సినిమా మ‌రీ ఆల‌స్యం అవుతుంద‌నుకున్న ప‌క్షంలో మ‌హేష్ - త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్కినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అదే జ‌రిగితే ప‌ర‌శురామ్ కూడా మ‌రి కొన్నాళ్లు నిరీక్షించాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS