మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన `అతడు` సినిమాని ఎప్పటికీ మర్చిపోలేరు. అదో క్లాసిక్. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. మధ్యలో వచ్చిన `ఖలేజా` డిజాస్టర్ అయినప్పటికీ.. ఆ సినిమా కూడా మహేష్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. అయితే.. హ్యాట్రిక్ సినిమా మాత్రం మహేష్ `అతడు`ని గుర్తుకు తీసుకురావడం ఖాయం అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఎందుకంటే.. ఈ సినిమాలో హీరోకి `పార్థూ` అనే పేరు పెడుతున్నాడట త్రివిక్రమ్. అతడులో మహేష్ పేరు కూడా పార్థూనే. అలా.. అతడు మ్యాజిక్ రీ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఈ సినిమా కోసం ప్రస్తుతానికి `పార్థూ` అనే టైటిల్ అనుకుంటున్నార్ట. భవిష్యత్తులో కూడా అదే ఉంటుందా? లేదంటే త్రివిక్రమ్ కి `అ` సెంటిమెంట్ ఉంది కాబట్టి, దాని ప్రకారం.. టైటిల్ మారుస్తాడా? అనేది తేలాలి. ఈనెల 31న ఈచిత్రం అధికారికంగా మొదలవుతుంది. 2022 వేసవికి విడుదల చేస్తారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కథానాయికగా చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. దిశా పటానీని సైతం పరిశీలిస్తున్నట్టు టాక్. మరి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.