‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నట్లు మహేష్ అధికారికంగా ప్రకటించాడు కూడా. ఏమయ్యిందో, ఆ సినిమా కాస్త వెనక్కి వెళ్ళింది. ‘గీత గోవిందం’ ఫేం పరశురామ్ తో మహేష్ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌పైనా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో మహేష్ - వంశీ మధ్య చర్చలు మళ్ళీ షురూ అయ్యాయనీ, వంశీ చెప్పిన సబ్జెక్ట్ మీద మహేష్‌కి ఇంట్రెస్ట్ పెరిగిందనీ అంటున్నారు.
ఈ సారి ఎక్కువ సమయం తీసుకోకుండా, తక్కువ సమయంలోనే సినిమాని రూపొందించేలా వంశీ పైడిపల్లి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడనీ, పైగా ఈసారి ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్కోప్ ఇచ్చేలా తన కథలో వంశీ మార్పులు చేసుకున్నాడనీ గుసగుసలు విన్పిస్తున్నాయి. లాక్‌డౌన్ ముగిశాక వంశీ - మహేష్ కలిసి చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారట. మరి, పరశురామ్ సంగతేంటి.? అంటే, ఒకేసారి పరశురామ్ తోనూ వంశీతోనూ మహేష్ సినిమాలు చేసే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు. అదే జరిగితే అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంది.? నిజానికి, 2020లో తన నుంచి రెండు సినిమాలు రావాలనే టార్గెట్ మహేష్ పెట్టుకున్నా, లాక్‌డౌన్.. మహేష్ ఆలోచనలకి బ్రేక్ వేసినట్లే కన్పిస్తోంది.