సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన 'భరత్ అను నేను' సినిమా ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో సినిమా పబ్లిసిటీ జోరందుకుంటోంది. ఆడియో సింగిల్స్ విడుదల చేస్తూ, సినిమాపై హైప్ పెంచేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. ఈ నెల 7వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.
హైద్రాబాద్ ఎల్బీ స్టేడియంలో 'బహిరంగ సభ' పేరుతో దీన్ని నిర్వహిస్తారు. రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ప్రచారం పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది 'భరత్ అను నేను'. 'పదవీ ప్రమాణ స్వీకారం' దగ్గర్నుంచి ప్రతీదీ చాలా బాగా డిజైన్ చేశారు. అంతా పొలిటికల్ స్టైల్‌లోనే సాగుతోంది. అయితే, సినిమా రాజకీయాలపై ఎలాంటి సెటైర్లు వేస్తుందన్న ఉత్కంఠ అన్ని రాజకీయ పార్టీల్లోనూ కన్పిస్తోంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రమనే అంచనాలు ఇప్పటికే సినిమాపై ఎక్కువైపోయాయి.
దానికి తగ్గట్టే దర్శకుడు కొరటాల శివ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీకి సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ పంచ్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఆ పంచ్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకీ గట్టిగానే పడింది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ విడుదలైతే, పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుందని నిస్సందేహంగా భావించొచ్చు.
సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ మనిషి. అయితే మహేష్ బావ గల్లా జయదేవ్ తెలుగదేశం పార్టీ ఎంపీగా పనిచేస్తున్నారు. ఇన్ని ఈక్వేషన్స్ నడుమ, మహేష్ 'భరత్ అను నేను' పొలిటికల్‌గా ఏ సైడ్ తీసుకుంటుందోగానీ, సినిమా కోసం రాజకీయ పార్టీలూ ఉత్కంఠగా ఎదురుచూడటం ఆసక్తికరమైన అంశమే.