మెగాస్టార్ చిరంజీవి ఇంకా రాజకీయాలతో టచ్‌లోనే వున్నారా.? అయితే, ఏ రాజకీయ పార్టీకి ఆయన మద్దతిస్తున్నారు.? కాంగ్రెస్‌తో ఆయన అనుబంధం తెగిపోయినట్లేనా.? ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని చిరంజీవి కలవడంలో మతలబు ఏమిటి.? లాంటి ప్రశ్నలకు చిరంజీవి తన తాజా ఇంటర్వ్యూలో ఓ క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించడంలేదనీ, ప్రజోపయోగ కార్యక్రమాల విషయంలో సగటు పౌరుడిగా, బాధ్యతగల వ్యక్తిగా తన అభిప్రాయాల్ని చెప్పే స్వేచ్ఛ తనకు వుంటుంది తప్ప, రాజకీయాల పట్ల తనకు మునుపటి ఆసక్తి లేదని స్పష్టం చేసేశారు మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఎలాంటి అనుబంధం వుందో, తెలంగాణ ముఖ్యమంత్రితోనూ అలాంటి అనుబంధమే వుందనీ, దీంట్లో రాజకీయ కోణం ఏమీ లేదన్నారు చిరంజీవి.
తన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగాలని ఓ సోదరుడిగా తాను ఆకాంక్షిస్తాననీ, తన పూర్తి మద్దతు, ఆశీస్సులు జనసేన పార్టీకి ఎప్పుడూ వుంటాయని చిరంజీవి చెప్పుకొచ్చారు. ‘మా ఆలోచనలు వేరు, మా దారులు వేరు.. కానీ, లక్ష్యం ఒక్కటే.. అదే ప్రజాసేవ..’ అని చంరజీవి చెప్పారు. ఏదో ఒక పార్టీతో తనకు లింకులు కట్టడం సబబు కాదనీ, తాను అందరివాడినని చిరంజీవి అభిప్రాయపడ్డారు.