సినీ విశ్లేషకుడిగా, నటుడిగా, దర్శకుడిగా.. ఇలా విభిన్న పాత్రల్లో తనను తాను ముందుకు నడిపించుకున్నాడు కత్తి మహేష్. రాజకీయాల వైపు కూడా అడుగులేశాడు. దళితుల వైపు తన గళం విప్పాడు. ఇతరత్రా సమస్యలపై టెలివిజన్‌లో విశ్లేషకుడిగా కనిపించి, పాపులారిటీ పెంచుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజా ప్రతినిధిగా ఎదగాలనుకున్నాడు. ఏమో కాలం కలిసొస్తే ఆ ఛాన్స్ దక్కేదేమో.
ఇంతలోనే పెద్ద కుదుపు. హైద్రాబాద్ మహానగరం నుండి కత్తి మహేష్‌ని బహిష్కరించారు. ఇన్నాళ్లూ సంపాదించుకున్న ఇమేజ్ ఒక్కసారిగా పటాపంచలైపోయింది. నెగిటివ్‌గా ప్రచారం జరగడం వేరు. పూర్తిగా ఇమేజ్ మూలన పడిపోవడం వేరు. ఇలా ఎలా జరిగింది? అని ఆలోచిస్తే, కత్తి మహేష్ కొందరి చేతుల్లో పావుగా మారిపోయాడు. అది ఆయనే గ్రహించలేకపోయాడు. వాళ్ల టీఆర్‌పీ రేటింగ్స్ కోసం కత్తి మహేష్ నోట రాకూడని మాటల్ని రప్పించేశారు. అది ముందుగా తెలుసుకోలేక బోల్తా పడ్డాడు కత్తి మహేష్.
తన నోటి మాటే తనకి బోలెడంత ఇమేజ్ తెచ్చిపెట్టింది. అదే నోటి మాట ఇప్పుడు ఆయన్ని ఈ స్థాయికి దిగజార్చేసింది. ఎప్పుడు ఏ క్షణం ఎలా మారుతుందో తెలీదు. ఇందులో ఎవర్నీ నిందించడానికి లేదు. కత్తి మహేష్ తనను తాను నిందించుకోవడం తప్ప.