సాధారణ సినీ విశ్లేషకుడైన కత్తి మహేష్, పవన్‌కళ్యాణ్ వివాదంతో రాత్రికి రాత్రి 'వివాదాల స్టార్'గా ఎదిగిన వైనం అందరికీ తెలిసినదే. పవన్ అభిమానులు లైట్ తీసుకుని ఉంటే, కత్తి మహేష్ అనే వ్యక్తి చాలామందికి ఇప్పుడు తెలిసినంతగా తెలిసి ఉండేవాడు కాదు. తప్పో ఒప్పో నమ్మిన విషయాల్ని నమ్మినట్టుగా ప్రచారం చేస్తూ, ఆ ప్రచారమ్మీదే నిలబడి తన ఇమేజ్‌ని పెంచుకోవడంలో కత్తి మహేష్ సఫలమవుతున్నాడు.
సరిగ్గా 'అజ్ఞాతవాసి' సినిమాని టార్గెట్ చేసుకుని, పవన్‌కళ్యాణ్‌పై విమర్శలతో చెలరేగిపోతున్న కత్తి మహేష్ ఈ సినిమా వసూళ్ళపై ఎంత ప్రభావం చూపగలుగుతాడోనని సినీ వర్గాల్లో కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజకీయంగా కత్తి మహేష్ వ్యాఖ్యలు పవన్‌కళ్యాణ్‌కి కొంత ఇబ్బందికరం కావొచ్చుగానీ, సినిమాపై ఆ ప్రభావం ఉండకపోవచ్చు. పైగా కత్తి మహేష్ వివాదంతో 'అజ్ఞాతవాసి'పై ఏమన్నా చిన్న చిన్న అనుమానాలుంటే అవీ తొలగిపోయాయి. సినిమాపై అంచనాలు ఇంకా పెరగడానికి పరోక్షంగా కత్తి మహేష్ సహకరించినట్లయ్యింది. పబ్లిసిటీ కోసం 'అజ్ఞాతవాసి' టీమ్ పెద్దగా కష్టపడకుండానే గత నెల రోజులుగా ఈ సినిమా సోషల్ మీడియాలోనూ, ప్రింట్ - ఎలక్ట్రానిక్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
పవన్‌కళ్యాణ్‌కి అదనపు పబ్లిసిటీ అవసరం లేదు, కానీ వచ్చింది కత్తి మహేష్ వివాదం రూపంలో. పబ్లిసిటీ అన్న ఆలోచనలోంచి చూస్తే అటు కత్తి మహేష్ కూడా చాలా లాభం పొందినట్లే. కోట్లు ఖర్చు చేసినా ఆయనకు ఇంత పబ్లిసిటీ రాబోదు.