టాలీవుడ్‌లో సెంటిమెంట్లు చాలా ఎక్కువ. మహేష్ బాబు అయితే సెంటిమెంట్ల చుట్టూనే తిరుగుతుంటాడు. మహేష్ బాబు సినిమా టైటిళ్లు ఎక్కువగా మూడు అక్షరాలతో కనిపిస్తాయి. అదో సెంటిమెంట్. మహేష్‌బాబు తన సినిమా ఓపెనింగ్స్‌కి ఎప్పుడూ రాడు. అదో సెంటిమెంట్. ఎన్టీఆర్‌కీ ఓ సెంటిమెంట్ ఉంది. 9 వ నెంబరు అంటే తనకు చాలా లక్కీ. తన కారు నెంబర్లలో కూడా అన్నీ తొమ్మిదిలే కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మహేష్ కూడా ఎన్టీఆర్ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడనిపిస్తోంది.
మహర్షి సినిమాని మే 9న విడుదల చేశారు. అది సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుకీ 9 సెంటిమెంట్ నడుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌నీ, టీజర్‌నీ 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేశారు. ఈ రెండూ కలిపితే 9 వచ్చింది. రాబోయే టీజర్లూ, ప్రచార చిత్రాలూ, పాటలూ కూడా అలానే విడుదల చేయాలని ఫిక్సయ్యార్ట. అంటే ఎన్టీఆర్ లక్కీ నెంబర్... మహేష్‌కీ కలిసొచ్చిందన్నమాటేగా!