ఛలో తో సూపర్ హిట్టు కొట్టి తన ఎంట్రీని ఘనంగా ప్రారంభించాడు వెంకీ కుడుముల. భీష్మతో మరో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఓ హిట్టు వస్తే చాలు. ఆ దర్శకుడ్ని హీరోలు, నిర్మాతలు వదలరు. అలాంటిది వరుసగా రెండు హిట్లు కొట్టాడు. ఇక ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వెంకీ కుడుముల పరిస్థితీ అంతే. రెండు మూడు అగ్ర సంస్థల నుంచి అడ్వాన్సులు అందాయి. యూవీ క్రియేషన్స్, మైత్రీ మూవీస్ సంస్థలకు ఆయన పనిచేయాల్సివుంది.
ఇప్పుడు హీరోలెవరన్న విషయంలో కొంత సందిగ్థత నెలకొంది. ఎందుకంటే బడా హీరోలంతా బిజీగా ఉన్నారు. వెంకీ కుడుముల కూడా అగ్ర కథానాయకుడి కోసం ఎదురు చూసే పక్షంలో కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. అయితే... విజయ్ దేవరకొండతో వెంకీ ఓ సినిమా చేసే ఛాన్సుందన్నది టాలీవుడ్ టాక్. మైత్రీ మూవీస్‌లో విజయ్ దేవరకొండ సినిమా చేయాలి. అదే.. `హీరో`. ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.
ఆ స్థానంలో విజయ్‌తో ఓ సినిమా చేయాలని మైత్రీ భావిస్తోంది. కథ కుదిరిన పక్షంలో వెంకీ కుడుమల సినిమాని పట్టాలెక్కించేయాలన్న ప్లాన్ లో ఉంది. వెంకీ దగ్గర రెండు మూడు లైన్లు రెడీగా ఉన్నాయి. అందులో విజయ్ దేవరకొండకి ఏ కథ సెట్ అవుతుందో చూసుకోవాలి. ఆ తరవాత విజయ్ - వెంకీ మధ్య భేటీ కుదరాలి. ఇలా చాలా పనులున్నాయి. విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం ఈ యేడాది వేసవిలోనే ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది.