చిరంజీవి 152వ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడన్న వార్త అటు మెగా, ఇటు సూపర్ స్టార్ అభిమానుల్లో ఆశల్నీ, అంచనాల్నీ పెంచుతోంది. నిజానికి రామ్ చరణ్ చేయాల్సిన పాత్ర ఇది. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆలస్యం అవుతుండడంతో... కొరటాల శివ సినిమాకి డేట్లు సర్దుబాటు చేయలేకపోయాడు. చరణ్ స్థానంలో మహేష్ ఎంట్రీకి ద్వారాలు తెరచుకున్నాయి.
చరణ్ ఈ సినిమా చేస్తున్నాడు అనగానే కొన్ని కథలు, కథనాలూ బయటకు వచ్చాయి. చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసొడ్ లో రామ్ చరణ్ కనిపిస్తాడని అనుకున్నారు. కానీ మహేష్ బాబు రాకతో...``యంగ్ చిరంజీవిగా మహేష్ ఎలా కుదురుతాడు`అనే ప్రశ్నలు ఎక్కువయ్యాయి. నిజానికి... ఇందులో చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లాంటిదేం లేదు. నిజం ఏమిటంటే... నక్సల్ ఉద్యమం నేపథ్యంలో నడిచే కథ ఇది. దేవాదయ భూములు ఎలా దోపిడికి గురవుతున్నాయో చెబుతూ... ఆ భూములు దొరల చేతుల్లోంచి లాక్కోవడాని కథానాయకుడు చేసే పోరాటం ఈ కథ. ఇందులో చిరంజీవి కొన్ని సన్నివేశాలలో నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. ఆ సమయంలో చిరు లక్ష్యాల్ని,ఆదర్శాల్ని చూసి ప్రభావితుడైన యువ నక్సల్ పాత్రలో మహేష్ కనిపించనున్నాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరూ గురు శిష్యులన్నమాట. చిరు-మహేష్... ఇద్దరూ కొన్ని సన్నివేశాల్లో కలిసి నటించనున్నారు. ఆ రకంగా మహేష్, చిరంజీవి అభిమానులకు అది కనుల పండగే అనుకోవాలి. ఈసినిమా కోసం మహేష్ దాదాపుగా 30 రోజుల కాల్షీట్లు కేటాయించాల్సివస్తుందని తెలుస్తోంది. 30 రోజులంటే... పెద్ద పాత్రే.