ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.. అంటుంటారు పెద్దలు. పెద్దలేంటీ.? ఓ హీరో పాటలా పాడేసి మరీ చెప్పేశాడీ మాట. అయితే, మన కమెడియన్ ప్రియదర్శి ఉన్నాడు చూశారూ.. ఆయన విషయంలోనూ అంతే. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందట. మీరు మరీనూ.. ఇంకేదో ఊహించేసుకోకండి. విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడట. కానీ, కమెడియన్ అయిపోయాడు.
అంతేకాదు, ఇప్పుడీయన హీరో కూడా. తన రాక వెనక రహస్యమేంటో ఆయన మాటల్లోనే వివరించారు ప్రియదర్శి. రహస్యమంటే పెద్దగా రహస్యమేమీ లేదనుకోండీ.. 'పెళ్లిచూపులు' సినిమాతో ప్రియదర్శి కమెడియన్‌గా పాపులర్ అయ్యాడు. నిజానికి అంతకు ముందే 'టెర్రర్', 'బొమ్మల రామారం' సినిమాల్లో నటించాడు. వాటిలో విలన్‌గానే నటించాడు. కానీ జనాలకు ఆయన విలనిజం అస్సలు పట్టలేదు. కమెడియన్‌గానే ఆయన్ను గుర్తించారు. నిజానికి 'పెళ్లిచూపులు' సినిమాలో తానేం కామెడీ చేయలేదట. సీరియస్‌గా తనకిచ్చిన స్క్రిప్ట్ చేశాడట.. అంతే.
కానీ అదేమో ఆడియన్స్‌కి కామెడీగా కనెక్ట్ అయిపోయి, ఇదిగో ఇప్పుడు స్టార్ కమెడియన్ దిశగా ఆయన ప్రయాణం దూసుకెళ్లేలా చేసేశారు. అంతా ఆడియన్స్ మహత్యమే అంటున్నాడాయన. ఇదిలా ఉంటే, ప్రియదర్శి ప్రస్తుతం హీరోగా కూడా మారాడు కదా. అదేనండీ 'మల్లేశం' సినిమాతో. చింతకింది మల్లేశం అనే చేనేత కార్మికుడి జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా ప్రియదర్శి తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఈ శుక్రవారం 'మల్లేశం' ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.