తెలంగాణాకు చెందిన చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మల్లేశం'. ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి టైటిల్ రోల్ పోషించాడు ఈ సినిమాలో. ప్రియదర్శి అంటే, హీరోల పక్కన సెటైర్స్ వేస్తూ, తనదైన శైలి టైమింగ్ కామెడీతో ఆకట్టుకునే కుర్రోడే గుర్తుకొస్తాడు. కానీ, ఈ చింతకింది మల్లేశం పాత్రలో ప్రియదర్శి ఎంత చక్కగా ఒదిగిపోయాడో మాటల్లో చెప్పలేనిది.
ఆయన బాల్యం, తల్లి పడుతున్న కష్టాన్ని చూసి బాధపడుతూ, చేనేత వైపు ఎలా మొగ్గు చూపాడో, అందులోనూ ఇమడలేక ఆ తర్వాత ఏం చేశాడు.. చివరికి చేనేతను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేసి, ప్రపంచ స్థాయిలో ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడనే కథాంశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.
మధ్యలో తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. ఇలా రొమాంటిక్ యాంగిల్‌ని కూడా కుదించడం జరిగింది. అనన్య ఈ సినిమాలో ప్రియదర్శికి జంటగా నటించింది. తల్లి పాత్రలో ఝాన్సీ నటించింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమా రూపు రేఖలేంటనేవి తెలిసిపోయింది. అప్పటి తెలంగాణా పల్లెటూరి వాతావరణాన్ని చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారు డైరెక్టర్. ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఈ బయోపిక్‌కి మంచి ఆదరణ దక్కేలానే కనిపిస్తోంది. రాజ్. ఆర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.