ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లను మించిన ఉత్సాహంతో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. 'కబాలి', 'కాలా', '2.0', పేటా' ఇప్పుడు 'దర్బార్' ఇలా సూపర్ స్టార్ స్పీడుకు బ్రేకులే లేవు. సినిమా సినిమాకీ, కుర్ర హీరోలైనా గ్యాప్ తీసుకుంటున్నారేమో కానీ, సూపర్ స్టార్ మాత్రం అస్సలు గ్యాపే తీసుకోవడం లేదు. అందుకే ఆరు పదుల వయసుకొచ్చేసరికి ఏకంగా 160 సినిమాలు చేసేశారు. ఇది చిన్న విషయం కాదు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్‌లో 'దర్బార్' సినిమాలో నటిస్తున్న రజనీకాంత్ తదుపరి చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టేశారనీ తెలుస్తోంది.
'దర్బార్' సినిమాతో సూపర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకుంటారేమో అనుకున్నారంతా. కానీ, తాజా ప్రచారం ఆ అనుమానాలకు చెక్ పెట్టేసింది. ఆయన తదుపరి సినిమా ఏ డైరెక్టర్‌తో ఉండబోతోందో ఓ చిన్న హింట్ ఆడియన్స్‌లోకి చొచ్చుకొచ్చింది. అజిత్‌తో వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ శివతో రజనీకాంత్ సినిమా ఉండబోతోందనే వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. శివ తెలుగులోనూ 'శంఖం', శౌర్యం', 'దరువు' వంటి చిత్రాలను తెరకెక్కించాడు.
కానీ తెలుగులో కన్నా, తమిళంలో అజిత్‌తో రూపొందించిన 'వీరమ్', వేదాలం', వివేగం' సినిమాలతో మంచి విజయాలు, గుర్తింపు దక్కించుకున్నారాయన. ఇప్పుడు సూపర్ స్టార్ కోసం ఓ అదిరిపోయే స్టోరీ ప్రిపేర్ చేశారనీ తెలుస్తోంది. అజిత్‌తో పవర్‌ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ తెరకెక్కించిన శివ మరి రజనీతో తెరకెక్కించబోయే సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాలి. ఈ కాంబినేషన్‌కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.