కరోనా టైమ్ లో గప్‌చుప్ గా ఓ సినిమా తీసేశాడు మారుతి. తన `పక్కా కమర్షియల్`ని పక్కన పెట్టి, అతి తక్కువ సమయంలో `మంచి రోజులొచ్చాయి` సినిమా పూర్తి చేశాడు. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. దీపావళి సందర్భంగా డిసెంబరు 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సరికొత్త ట్రైలర్ ని వదిలింది చిత్రబృందం.
2 నిమిషాల పాటు సాగిన ట్రైలర్ ఇది. ట్రైలర్ మొత్తం.. ఫన్ రైడ్ గా సాగింది. హీరో, హీరోయిన్ల రొమాన్స్.. వెన్నెల కిషోర్, వైవా హర్షల కామెడీ.. మధ్యలో కరోనా - వీటన్నింటితో కథని లాగించేశారు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలూ ఆటక్టుకునేలానే ఉన్నాయి. హీరో - హీరోయిన్ల మధ్య ప్రేమ, ఆప్రేమకు హీరోయిన్ తండ్రి అడ్డు తగలడం, అతన్ని బకరాని చేసి ఆడుకోవడం, తమ ప్రేమని ఒప్పించుకోవడం - ఇదీ స్థూలంగా కథ. మారుతి మార్కు కామెడీ, రొమాంటిక్ సీన్లతో బండి నడిపించేసినట్టు కనిపిస్తోంది. ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ట్రైలర్ చూడగానే అర్థం అవుతోంది. కావల్సినంత మంద కామెడీ గ్యాంగ్ ఈ సినిమాలో ఉంది. ఇంకేం కావాలి..? ఈ పండక్కి థియేటర్లో నవ్వులు పిండుకోవడమే. మంచి రోజులు వచ్చాయి సినిమాతో.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తే - సినిమాలకూమంచి రోజులు వచ్చినట్టే.