పునీత్ రాజ్ కుమార్ మరణవార్త విని టాలీవుడ్ షాక్ కి గురైంది. తెలుగులో పునీత్ సినిమాలేం చేయలేదు. ఆయన నటించిన సినిమాలు కొన్ని డబ్బింగ్ రూపంలో వచ్చినా, పెద్దగా ఆదరించింది లేదు. కాకపోతే.. మన తెలుగుతో, తెలుగు కథలతో, తెలుగు హీరోలతో తనకు మంచి అనుబంధం ఉంది.
పునీత్ ని `పవర్ స్టార్.. పవర్ స్టార్` అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తనని పవర్ స్టార్ అని సంభోదిస్తే.. ఒప్పుకోలేదు. `ఇక్కడ ఒకే ఒక్క పవర్ స్టార్ ఉన్నారు. ఆయనే పవన్ కల్యాణ్. ఆయనకు నేను చాలా పెద్ద అభిమానిని. నేను కేవలం పునీత్ ని మాత్రమే. పవర్ స్టార్ కాదు` అని పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎన్టీఆర్ అంటే పునీత్ కి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే.. తన సినిమాలో ఎన్టీఆర్ తో ఓ పాట పాడించుకున్నాడు. అల్లు అర్జున్ తో తనకు పరిచయం ఉంది.
ఓ సినిమా ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వెళ్లాడు. పునీత్ మంచి డాన్సర్. శాండిల్ వుడ్ లోని టాప్ డాన్సర్లలో పునీత్ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు. అయినా సరే.. మన తెలుగు హీరోల డాన్సులకు వీరాభిమాని అయిపోయాడు పునీత్. ``బన్నీ, చరణ్, ఎన్టీఆర్ వీళ్లంతా బాగా డాన్స్ చేస్తారు. వాళ్ల నుంచి నేను చాలా నేర్చుకున్నా`` అని చెప్పేవాడు పునీత్.య తెలుగులో సూపర్ హిట్ అయిన ఒక్కడు, దూకుడు, రెఢీ, అమ్మా - నాన్న - ఓ తమిళ అమ్మాయి చిత్రాల్ని కన్నడలో రీమేక్ చేసి సూపర్ హిట్లు కొట్టాడు. ఇక్కడ సరిగా ఆడని ఆంధ్రావాలా కథని రీమేక్ చేస్తే.. కన్నడలో సూపర్ హిట్ అయ్యింది.