చిత్రసీమ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. ఏపీలో దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడ దాదాపు 170 థియేటర్లు మూసేసినట్టు సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. టికెట్ రేట్లపై యువ హీరోలు ఇప్పుడిప్పుడే గళం విప్పుతున్నారు. నాని థియేటర్ వసూళ్లని కిరాణ షాపు లెక్కలతో పోల్చడం వివాదాన్ని, ప్రకంపల్ని సృష్టించింది. తాజాగా నిఖిల్ కూడా ఈ విషయంపై మాట్లాడాడు. క్రమంగా యువ హీరోలు తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇన్ని జరుగుతున్నా. `మా` అధ్యక్షుడు మంచు విష్ణు అలికిడి లేదు. థియేటర్ల పరిస్థితి గురించి ఆయన మాట్లాడిందే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, సపోర్ట్ చేస్తూనో ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. సపోర్ట్ చేస్తూ మాట్లాడిన నాని పై ఏపీ మంత్రులు ఘాటు విమర్శలు చేస్తున్నా.. విష్ణు నుంచి అలికిడి లేదు. అసలు ఈ వ్యవహారంతో తనకు సంబంధమే లేనట్టు ప్రవర్తిస్తున్నాడని టాలీవుడ్ లో విమర్శలు వినిపిస్తున్నాయి. విష్ఱు మా ప్రెసిడెంట్ మాత్రమే కాదు. నిర్మాత కూడా. ఓ నిర్మాత సాధక బాధకాలు అర్థం చేసుకోవాల్సిన ఈ తరుణంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉంది. మరోవైపు జగన్ తనకు బంధువని చెప్పుకునే విష్ణు... దాన్ని కూడా వాడుకోకపోవడం, జగన్‌కి ఇండ్రస్ట్రీ సమస్యల గురించి చెప్పే ప్రయత్నం చేయకపోవడం... చర్చనీయాంశం అవుతోంది.