ఆర్.ఆర్.ఆర్... వాయిదా పడుతుందా? టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న హాట్ ప్రశ్న ఇది. మహారాష్ట్రలో... థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతానికి కుదిస్తూ, ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో.. ఆర్.ఆర్.ఆర్ బృందానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. పాన్ ఇండియా సినిమాలకు ముంబై కీలకమైన మార్కెట్. అక్కడ భారీ వసూళ్లని సాధించడమే వాటి టార్గెట్. ఆర్.ఆర్.ఆర్ లక్ష్యం కూడా అదే. ముంబైలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన ఉంటే, ఈ సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ రావడం అసాధ్యం. జనవరి 7 నాటికి ఈ పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవొచ్చు. సరి కదా.. ఏపీ, తెలంగాణలలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే... అది పెద్ద సినిమాలకు కోలుకోలేని దెబ్బ. అందుకే.. ఆర్.ఆర్.ఆర్ వేచి ఉండే ధోరణి అవలంభించే అవకాశం ఉంది. ఈమేరకు ఆర్.ఆర్.ఆర్ ని వాయిదా వేసినా, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఒకవేళ ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడితే... భీమ్లా నాయక్ రంగంలోకి దిగుతాడు. ఎందుకంటే.. ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ పాన్ ఇండియా సినిమాలు కాబట్టి, జనవరి 12న రావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. ఆర్.ఆర్.ఆర్ రాకపోతే.. మాత్రం భీమ్లా నాయక్ కి చోటు దొరికేసినట్టే. ముంబైలో ఇవే పరిస్థితులు ఉంటే, రాధే శ్యామ్ కూడా రాకపోవొచ్చు. అదే జరిగితే ఈ సంక్రాంతికి పాన్ ఇండియా సినిమాల స్థానంలో పక్కా తెలుగు సినిమాలే చూడొచ్చు.