గత కొన్నేళ్లుగా మంచు మనోజ్ కనిపించడమే మానేశాడు. కనీసం మీడియా ముందుకి కూడా రాలేదు. తన సినిమా ఒకటి ఆమధ్య పట్టాలెక్కినా... ఆగిపోయింది. వైవాహిక జీవితంలోనూ అపశృతులు ఎదురయ్యాయి. మనోజ్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పాడని, రాజకీయాల్లో చేరబోతున్నాడని వార్తలొచ్చాయి. అయితే... అవన్నీ ఒట్టి పుకారే అని తేలిపోయింది. మనోజ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన పర్సనల్ లైఫ్ కూడా సెట్ చేసుకోబోతున్నాడు.
మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అది నిజమే అని తేలిపోయింది. భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికని మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్. ఈ విషయమై మనోజ్ గానీ, భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు గానీ ఇప్పటి వరకూ స్పందించలేదు. కాకపోతే.. పెళ్లికి ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయట. ఫిబ్రవరి 2న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం అందుతోంది. మనోజ్ శుక్రవారం కడపలోని పెద దర్గాని దర్శించుకొన్నాడు. ఈ సందర్భంగా పాత్రికేయులతోనూ మాట్లాడాడు. ''కొత్త జీవితం ప్రారంభిస్తున్నా. త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. సినిమాలూ మొదలవుతాయి'' అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు మనోజ్. సో... మనోజ్ రెండో ఇన్నింగ్స్‌కి ముహూర్తం ఫిక్సయినట్టే.