మంచు Vs మెగా కాంపౌండ్ రాజకీయాలలో మరో ట్విస్ట్ ఇది. గురువారం.. పవన్ కల్యాణ్ తో మంచు మనోజ్ భేటీ వేశారు. ఇద్దరూ గంటసేపు సమావేశం అయ్యారు. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా మీడియా ముందుకు వచ్చాయి. దాంతో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? అసలు ఈ భేటీ దేని కోసం అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన `మా` ఎన్నికలలో తలెత్తిన వివాదాల గురించి తెలిసిందే.
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ సైతం `మోహన్ బాబు... మీరు మాట్లాడరేం` అంటూ ప్రశ్నించాడు. మోహన్ బాబు కూడా `మా` ఎన్నికలు అయిపోయాక.. మాట్లాడతా అని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెగా, మంచు కాంపౌండ్ ల మధ్య మరింత దూరం పెరిగిందన్న సంకేతాలు అందాయి. అయితే `మా` పోలింగ్ రోజున... మంచు మనోజ్ - పవన్ కల్యాణ్‌ల ఆలింగనాలు, చిరునవ్వుల సంభాషణలు.. ఇవన్నీ వాతావరణాన్ని కాస్త తేలిక పరిచాయి.
ఇప్పుడు మనోజ్ కూడా అదే ప్రయత్నం మరింత దృఢంగా చేసినట్టు సమాచారం. పవన్ కల్యాణ్ అంటే మనోజ్ కి చాలా ఇష్టం. ఈ విషయాన్ని మనోజ్ సైతం చాలా సందర్భాల్లో ప్రకటించాడు. అదే ప్రేమతో - పవన్ ని కలిసినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య `మా`కి సంబంధించిన అంశాలు, సమకాలీన రాజకీయాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఓ రకంగా.. మోహన్ బాబుకీ, పవన్‌కీ మనోజ్ మధ్యవర్తిత్వం వహించబోతున్నట్టు సమాచారం వస్తోంది. `జరిగిందేదో జరిగింది. ఇద్దరూ టాలీవుడ్ శ్రేయస్సు కోసమే మాట్లాడారు. ఇక వ్యక్తిగత దూషణలు అనవసరం` అంటూ మనోజ్ చెప్పినట్టు తెలుస్తోంది. మోహన్ బాబు ఓ ప్రెస్ మీట్ పెట్టి, పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో వ్యక్తిగత విమర్శలు, దూషణలు, ఛాలెంజ్‌లూ ఇక కనిపించే అవకాశం లేదన్న సంకేతాలు ఈ భేటీతో అందినట్టైంది.