13 ఏళ్ళ క్రితం విడుదలైన ‘ఢీ’ సినిమా మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. అప్పట్లో ‘ఢీ’ సంచలన విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పలు భాషల్లోకి ఈ సినిమా రీమేక్ అయ్యింది కూడా. అంతే కాదు, ‘ఢీ’ ఫార్మాట్‌లో చాలా చాలా సినిమాలు తెలుగులోనే వచ్చాయి. కమర్షియల్ సినిమాకి కేరాఫ్ అడ్రస్‌గా ‘ఢీ’ ఫార్మాట్ అప్పట్లో కన్పించింది. విష్ణు, జెనీలియా జంటగా నటించిన చిత్రమిది. శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకుడు. చాలాకాలంగా ‘ఢీ’ సీక్వెల్ గురించిన చర్చలు నడుస్తున్నాయి. ఎలాగైనా ‘ఢీ’ సీక్వెల్ రూపొందించాలని మంచు విష్ణు ప్రయత్నిస్తూనే వున్నాడు. అయితే, టైవ్‌ు కలిసి రావడంలేదు.
దర్శకుడిగా శ్రీను వైట్ల మునుపటి ఫామ్ కోల్పోయినా, ఆయనతోనే సీక్వెల్ చేయాలన్నది మంచు విష్ణు ఆలోచనగా కన్పిస్తోంది. తాజాగా శ్రీను వైట్లకే ఓ ప్రశ్న సంధించాడు మంచు విష్ణు ‘ఢీ’ సీక్వెల్ విషయమై. అయితే, శ్రీను వైట్ల ‘టైమ్ కలిసి రావాలి’ అంటున్నాడు. కానీ, తెరవెనుక ‘ఢీ’ సీక్వెల్ ప్లానింగ్స్ జరుగుతున్నాయనీ, మళ్ళీ శ్రీను వైట్ల - కోణ వెంకట్ కలిసి పనిచేసే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2021 ఫస్ట్ క్వార్టర్‌లోనే ‘ఢీ’ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్ళొచ్చట. మంచు విష్ణు ఈ చిత్రంలో నటించడంతోపాటు, ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలూ తీసుకుంటాడని సమాచారం.