`మా` కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యాడు. గెలిచాక ఆయన ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. `చిరంజీవి అంకుల్ నన్ను పోటీ నుంచి తప్పుకోమన్నారు. కానీ... పోటీ చేయాల్సివచ్చింది` అంటూ మరింత కాక రేపే ప్రయత్నం చేశారు. చిరు విష్ణుని తప్పుకోమన్నాడంటే.. ప్రకాష్ రాజ్ ని గెలిపించాలనే ప్రయత్నం చేసినట్టే కదా?
కాకపోతే.. చిరు ప్రయత్నంలో తప్పులేదు. ఎందుకంటే... మా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా, ఎన్నికల వరకూ వెళ్లకూడదని, ఏకగ్రీవంగా ఎంచుకోవాలన్నది సినీ పెద్దల అభిప్రాయం.చాలా ఏళ్లుగా అదే చేశారు. ఎప్పుడైతే.. పోటీ మొదలవుతుందో, అప్పుడు పరస్పర ఆరోపణలు చేయాల్సి ఉంటుంది. దాంతో `మా` ప్రతిష్ట మసకబారుతోంది. ఈసారి అదే జరిగింది. ఇదంతా ముందుగానే ఊహించి, విష్ణుని తప్పుకోమని సలహా ఇచ్చి ఉంటారు. నిజానికి విష్ణు తప్పుకుని ఉంటే, ఈసారి ఇంత రగడ జరిగేదే కాదు. ప్రకాష్ రాజ్ ని ఏకగ్రీవంగా ఎంచుకుని ఉండేవారు. అందుకే చిరు.. సలహా ఇచ్చి ఉంటాడు. కానీ విష్ణు చిరు సలహా పట్టించుకోకుండా, పోటీలోకి దిగాడు. ఇప్పుడు విజయం సాధించాడు.