క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాలీవుడ్ సినిమా 'మణికర్ణిక' ట్రైలర్ మహాత్ముడి జయంతి సందర్భంగా నేడు విడుదల చేశారు. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఈ సినిమాలో మణికర్ణికగా నటించింది. ఝాన్సీ రాణి మణికర్ణిక జీవిత చరిత్ర దేశ ప్రజలందరికీ తెలుసు.
స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ సైన్యాన్ని ధైర్యంతో ఎదుర్కొన్న మహిళ మణికర్ణిక. ఝాన్సీ సామ్రాజ్య రాణిగా మణికర్ణిక సుపరిచితురాలే అయినా, అందరికీ ఆమె ఝాన్సీ లక్ష్మీబాయిగానే సుపరిచితురాలు. ఆ మణికర్ణిక జీవిత చరిత్ర, స్వాతంత్య్ర పోరాటం... ఇవన్నీ ఈ సినిమాలో కన్పించబోతున్నాయి. ట్రైలర్‌లో ప్రతి ఫ్రేమ్ చాలా చాలా చాలా రిచ్‌గా తెరకెక్కాయి. ఇదొక విజువల్ వండర్ అంటే అది అతిశయోక్తి కాదేమో. పోరాట ఘట్టాల్నే తీసుకుంటే నభూతో నభవిష్యతి అనేలా కన్పిస్తున్నాయి.
ఈ తరహాలో ఇప్పటికే క్రిష్ రెండు సినిమాలు చేసేశాడు తెలుగులో ఒకటి 'కంచె' కాగా, ఇంకొకటి 'గౌతమి పుత్ర శాతకర్ణి'. ఈ రెండూ యుద్ధాల నేపథ్యంలో తీసినవే. అందుబాటులో వున్న బడ్జెట్‌తో అద్భుతాలు చేయడం క్రిష్ ప్రత్యేకత. ఈసారి కోరినంత బడ్జెట్ క్రిష్‌కి అందుబాటులోకి వచ్చింది. దాంతో, ఇండియన్ సినిమా స్క్రీన్‌పైనే ఇదొక అద్భుతమైన విజువల్ వండర్ అనే స్థాయిలో తెరకెక్కించాడు.
అయితే, సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చాక, చిన్నపాటి అభిప్రాయ బేధాల కారణంగా.. కొన్ని సన్నివేశాల్ని తన స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ రీషూట్ చేసింది. అదొక్కటే సినిమాపై వున్న కాస్త నెగెటివ్ అభిప్రాయానికి కారణం. టీజర్ వరకూ మాత్రం క్రిష్ కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పిస్తోంది.