పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రోగ్' చిత్రం ద్వారా పాపులర్ అయిన బ్యూటీ మనారా చోప్రా. పర్‌ఫామెన్స్ సంగతి పక్కన పెడితే, అమ్మడికి హాట్ అప్పీల్ మాత్రం చాలా ఎక్కువ. పూరీ జగన్నాధ్ సినిమాలో ఈ అమ్మడు అందాల ఆరబోతతో సెన్సేషన్ అయ్యింది. అంతగా అందాల ప్రదర్శన చేసినా కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకి పెద్దగా అవకాశాలు రాలేదు.
తాజాగా జరుగుతున్న బాలల చిత్రోత్సవంలో ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది. బాలలపై ఎన్నో ఇన్‌స్పైరింగ్ సినిమాలను ఈ చిత్రోత్సవంలో తిలకించింది ఈ బ్యూటీ. దాంతో ఈ ముద్దుగుమ్మ మదిలో ఓ చిలిపి కోరిక మెదిలిందట. పిల్లలంటే ఈ ముద్దుగుమ్మకి చాలా ఇష్టమని చెబుతోంది. గతంలో పిల్లలపై అనేక చలన చిత్రాలు ఆకట్టుకున్నాయి. అందుకే చలన చిత్రోత్సవాల్లో బాలలపై ఇన్ని సినిమాలు చూశాక, పిల్లలతో తనకీ ఓ సినిమా తెరకెక్కించాలని అనిపిస్తుందట. ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని పిల్లలతో తెరకెక్కించాలని అనుకుంటోందట. అంటే ఈ హాట్ బ్యూటీ కొంప తీసి డైరెక్టర్‌గా మారాలనుకుంటోందా? అని నోరు వెళ్లబెట్టకండి సుమీ. ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్‌గా మారదటలెండి. ఆమెనే క్లారిటీ ఇచ్చేసింది.
నిర్మాతగా మారి సినిమా తీస్తానంటోంది అంతే. ఇప్పటికే అక్క ప్రియాంక చోప్రా నిర్మాతగా మారి బాలీవుడ్‌లో పలు చిత్రాలను రూపొందిస్తోంది. అదే బాటలో తానూ నడుస్తానంటోంది మనారా చోప్రా. నిర్మాతగా మారినా హీరోయిన్‌గా సినిమాలు చేస్తానంటోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. పూరీ మంచి డైరెక్టర్ అనీ, పూరీతో 'రోగ్' సినిమా చేయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందనీ అంటోంది. అలాగే సునీల్‌తో 'జక్కన్న' సినిమాలోనూ నటించిందీ బ్యూటీ.