మారుతి దర్శకత్వం వహించిన చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. దీపావళి సందర్భంగా గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గురువారమే రజనీకాంత్ `పెద్దన్న` రిలీజ్ అవుతోంది. పెద్దన్నతో పోటీ పడడం అంటే... కష్టమే. ఎందుకంటే రజనీకాంత్ స్టామినా ఏ పాటిదో తెలుసు. పైగా పెద్దన్నలో... స్టార్ హంగామా ఎక్కువగా కనిపిస్తోంది.అది మాస్ సినిమా ఆయె. చాలా రోజుల తరవాత రజనీ చేసిన సంపూర్ణ మాస్ మసాలా సినిమా ఇది. అందుకే తెలుగు నాట కూడా ఈ సినిమాకి ఎక్కువ ఓపెనింగ్స్ ఉండొచ్చు. దాంతో పోటీ పడడం సాహసమే.
దాంతో పాటు మరో రిస్క్ కూడా చేస్తున్నాడు మారుతి. ఈరోజే.. చాలా చోట్ల ప్రీమియర్ షోలు ప్లాన్ చేశాడు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, భీమవరం, ఏలూరు లాంటి చోట్ల.. ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. అంటే తెల్లారే సరికల్లా టాక్ తెలిసిపోతుందన్నమాట. సినిమా బాగుంటే, పెద్దన్నతో పోటీగా ఈ సినిమా వసూళ్లు తెచ్చుకుంటుంది. అటూ ఇటుగా టాక్ వస్తే మాత్రం...చాలా కష్టం. అయినా సరే, మారుతి రిస్క్ చేస్తున్నాడంటే సినిమాపై తనకు నమ్మకం ఉన్నట్టే లెక్క. మరి ఈ గురువారం ఏం జరుగుతుందో చూడాలి.