మరక మంచిదే అన్నట్టు... కొన్నిసార్లు ఆలస్యం కూడా మంచిదే. మారుతి విషయంలో ఇదే జరుగుతోందేమో అనిపిస్తోంది. మారుతి దర్శకత్వం వహించిన 'పక్కా కమర్షియల్' ఎప్పుడో విడుదల కావల్సిన సినిమా. కానీ ఆలస్యం అవుతోంది. పలుమార్లు విడుదల తేదీ ప్రకటించారు. ఆ తరవాత వాయిదా వేశారు. ఇప్పటికైతే జులై 1న రావాలి. అందుకు చాలా టైమ్ ఉంది. అందుకే మారుతి రిలాక్డ్స్‌గా తన తదుపరి సినిమా పనిలో పడిపోయాడు. మారుతి ఇప్పుడు ప్రభాస్ సినిమా పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ రిజల్ట్ తో సంబంధం లేకుండా.. మారుతి ప్రభాస్ సినిమాకి ఓకే చేయించుకోవడం మామూలు విషయం కాదు. దానికి తోడు మారుతి ఆమధ్య తీసిన `మంచి రోజులు వచ్చాయి` ఫ్లాప్ అయ్యింది. అయితే... కరోనా టైమ్ కావడం... చిన్న హీరో సినిమా కావడం వల్ల... ఆ సినిమా సైలెంట్ గా వచ్చి, సైలెంట్ గా వెళ్లిపోయింది.
'పక్కా కమర్షియల్' అలా కాదు. గోపీచంద్ సినిమా ఇది. యూవీ, గీతా 2 లాంటి పెద్ద సంస్థలు కలిసి తీసిన సినిమా. ఈ సినిమా ఫలితం కచ్చితంగా మారుతిపై పడుతుంది. అనుకున్న సమయానికి `పక్కా కమర్షియల్` విడుదలై.. ఫలితం తేడా కొడితే.. మారుతి సంగతి అటుంచి, ప్రభాస్ టెన్షన్‌లో పడిపోయేవాడు. `మారుతితో సినిమా చేయాలా, వద్దా` అనే డైలామా ఉండేది. ఇప్పుడు ఆ ప్రమాదం లేకుండా పోయింది. `పక్కా కమర్షియల్` విడుదలయ్యే సరికి.... మారుతి - ప్రభాస్ సినిమాకి కొబ్బరి కాయ కొట్టేయడం, పట్టాలెక్కేయడం జరిగిపోతాయి. సో... తన సినిమా ప్రభావం తనపై లేకుండా మారుతి జాగ్రత్త తీసుకొన్నాడనే చెప్పాలి.