బాలీవుడ్ కుదిపేస్తున్న మీటూ వివాదంలో ఇప్పటిదాకా ఓ దర్శకుడు, ఇద్దరు సీనియర్ నటుల పేర్లు మాత్రమే తెరపైకొచ్చాయి. ఆరోపణలు వచ్చినంత మాత్రాన వారిని ఇప్పుడే దోషులుగా చూడలేం. కానీ 'మీటూ' ఉద్యమ తీవ్రత నేపథ్యంలో వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఎవరూ సాహసించడంలేదు.
బాలీవుడ్ స్టార్ హీరోలైన అమీర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ 'మీటూ' ఆరోపణల నేపథ్యంలో తమ తమ సినిమాల్ని పక్కన పెట్టారు. తద్వారా ఈ ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని దోషులుగా ప్రకటించేసినట్లే అయ్యింది. అదలా ఉంచితే, మీటూ ఉద్యమం పట్ల సానుకూలంగా స్పందించి, సంఘీభావం తెలిపిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కి ట్విట్టర్ ద్వారా ఓ సీనియర్ జర్నలిస్ట్ ఝలక్ ఇచ్చింది. మీ గురించి మాట్లాడాల్సి వస్తే, మీ పరిస్థితి ఎలా వుంటుందోనని హెచ్చరించిందామె.
అంటే, ఆమె బహుశా అమితాబ్ తనను వేధించాడనో లేదంటే ఇంకెవర్నయినా అమితాబ్ వేధించాడనో చెప్పబోతోందన్నమాట. బాలీవుడ్‌లో మాత్రమే కాదు, ఇతర సినీ పరిశ్రమల్లోనూ ఇలాంటి పరిస్థితులున్నాయి. దాంతో అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరోపణలు చేయడం చాలా తేలిక. అవి నిరూపించబడాలంటే న్యాయస్థానాలే ఆ పని చేయాల్సి వుంటుంది.
ఈలోగా, ప్రముఖుల మీద వచ్చే ఆరోపణలు, వారి ఇమేజ్‌ని దెబ్బతీస్తాయి. నానా పటేకర్, తన మీద వచ్చిన ఆరోపణలకు గట్టిగా నిలబడినా, ఆయన ప్రస్తుతం దేశం దృష్టిలో దోషిగా నిలబడాల్సిన పరిస్థితి. దాంతో, మీటూ గురించి ఎవరు ఎప్పుడు ఎలాంటి బాంబు పేల్చుతారోనని పురుష పుంగవులు బిక్కుబిక్కుమనాల్సి వస్తోంది. ప్రత్యక్షంగా వేధింపులకు సినీ ప్రముఖులు పాల్పడకపోయినా, వాటిని పరిశ్రమలో చూసీ, వాటికి వ్యతిరేకంగా మొదట్లోనే గళం విప్పకపోవడమే ఈ దుస్థితికి కారణంగా చెప్పవచ్చు