విజయ్ దేవరకొండ నిర్మాణంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోయిజంతో తెరకెక్కుతోన్న సినిమా 'మీకు మాత్రమే చెప్తా'. టైటిల్ అనౌన్స్మెంట్ నుండీ ఈ సినిమా ఆసక్తి రేపుతూనే ఉంది. టైటిల్ అనౌన్స్మెంట్ రోజు మన హీరో తరుణ్ భాస్కర్, నిర్మాత విజయ్ దేవరకొండతో కలిసి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక ఈ మధ్య విడుదలైన టీజర్ కూడా అంతే సందడి చేసింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ని వదలబోతున్నారు.
సూపర్ స్టార్ మహేష్‌బాబు చేతుల మీదుగా ట్రైలర్ రానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. గతంలో మహేష్ నటించిన 'మహర్షి' సినిమా ఈవెంట్లో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొని, స్టేజ్‌పై చేసిన రచ్చ మర్చిపోలేం. మహేష్‌బాబును 'సర్' అని పిలవలేను.. అంటూ తన ఆటిట్యూడ్ చూపించాడు. ఆ తర్వాత రౌడీస్టార్ తన బర్త్‌డే వేడుకల్ని కూడా మహేష్‌బాబుతో కలిసి చేసుకున్న సంగతి తెలిసిందే. అంత చేశాడు కదా.. అందుకే ఇప్పుడు రౌడీ కోసం మహేష్ కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు.
విజయ్ దేవరకొండ తొలిసారి నిర్మాతగా మారి రూపొందిస్తున్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా' ట్రైలర్‌ని తన చేతుల మీద విడుదల చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రకమైన ఆసక్తి ఉంది. ఇప్పుడు మహేష్ చేయి పడడంతో, ఆ ఆసక్తి మరింత పెరిగింది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సమీర్ దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.