హీరోల్ని దేవుడిగా పూజిస్తుంటారు ఫ్యాన్స్. అభిమాన హీరో సినిమా విడుదలైతే.. వాళ్లు చేసే హడావుడి మామూలుగా ఉండదు. కటౌట్లు, పాలాభిషేకాలు, సినిమా సరిగా లేకపోతే.. బలవంతంగా ఆడించుకోవడాలూ... ఇలా ఏదైనా చేస్తారు. వీటన్నింటికీ డబ్బులు వాళ్లవే. అలా... ఆస్తుల్ని అమ్ముకుని, ఇల్లు గుల్ల చేసుకునేవాళ్లెంతమందో..? కన్నతల్లికి కూడు పెట్టినా పెట్టకపోయినా, హీరోలకు మాత్రం ఇలాంటి ఖర్చులు పెట్టాల్సిందే. అలా చిరంజీవిని దైవం కంటే ఎక్కువగా పూజించిన ఓ అభిమాని... ఆస్తులన్నీ పోగొట్టుకుని, రోడ్డుపై పడ్డాడు.
భట్టు బాలాజీ అనే ఓ మెగాస్టార్ ఫ్యాన్ కథ ఇది. తనది మహబూబాబాద్ లోని భవానీ నగర్. చిన్నప్పటి నుంచీ చిరంజీవి అభిమాని. ఆ అభిమానం పేరుతో లెక్కకు మించి ఆడంబరాలు చేశాడు. కటౌట్ల కోసం, ఫ్లెక్సీల కోసం బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాడు. చిరంజీవి పుట్టిన రోజు వస్తే... రక్తదానాలు, అన్నదానాలు చేశాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, తన నియోజక వర్గంలోని అభ్యర్థిని గెలిపించడానికి మూడు ఎకరాలు అమ్ముకున్నాడట. ఇప్పుడు తను రోడ్డున పడ్డాడు. ఆస్తులన్నీ పోయి, అప్పుల పాలయ్యాడు. నన్ను చిరంజీవినే ఆదుకోవాలని... ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడిప్పుడు. అయితే.. తన వేదన చిరు వరకూ చేరలేదు. అయితే.. మీడియాలో మాత్రం ఇప్పుడు ఈ అభిమాని గురించిన చర్చ జరుగుతోంది. బాలాజీ ఒక్కడే కాదు. ఇలా హీరోల పేరు చెప్పి, అప్పుల పాలైన వాళ్లెంతో మంది. బయటకు వచ్చింది బాలాజీ మాత్రమే.