'గీత గోవిందం' సినిమాకు ప్రశంసల వర్షం ఆగట్లేదు. సినీ ప్రముఖులంతా వరుస పెట్టి ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొట్ట మొదటిగా మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని చూసి విజయ్‌దేవరకొండను, చిత్ర యూనిట్‌నీ ప్రశంసలతో ముంచెత్తగా, సూపర్‌స్టార్ మహేష్‌బాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జక్కన్న రాజమౌళి తదితర సినీ ప్రముఖులతో సహా పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇక తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా విజయ్ దేవరకొండను ప్రత్యేకంగా ప్రశంసించారు. 'అర్జున్‌రెడ్డి' తర్వాత పర్‌ఫెక్ట్ ఛేంజ్ ఓవర్ విజయ్ దేవరకొండలో. సినిమా ఓ ట్రీట్‌లా ఉంది.. అని చరణ్ విజయ్ దేవరకొండను ప్రశంసలతో ముంచెత్తేశారు. స్క్రిప్టుకు విజయ్ దేవరకొండ, రష్మికా నటన మరింత అందాన్ని తెచ్చిందని చరణ్ అన్నారు. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఇలా 'గీత గోవిందం' సినిమాకి ఓ వైపు ప్రశంసలు మరోవైపు వసూళ్లు ఓ రేంజ్‌లో వచ్చి పడుతున్నాయి. ప్రశంసల జల్లుతో తడిసి ముద్దవుతోంది చిత్ర యూనిట్. ఇక హీరోగా విజయ్ దేవరకొండ 'అర్జున్‌రెడ్డి' నుండి గోవిందుడుగా పాపులర్ అయిపోతున్నాడు. ఇంతగా సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ, చిత్ర యూనిట్ ఈ నెల 19న ఘనంగా సక్సెస్ ఫంక్షన్ నిర్వహిస్తోంది.
ఈ ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు.