'గురు' తర్వాత మరో సినిమా చేయలేదు విక్టరీ వెంకటేష్. కానీ వచ్చే ఏడాది మాత్రం వరుస పెట్టి సినిమాలు రానున్నాయి వెంకటేష్ నుండి. ఆల్రెడీ మెగా ప్రాజెక్ట్ 'ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్' చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే యోచనలో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఉన్నారు. వరుణ్‌తేజ్ - వెంకీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే మేనల్లుడు నాగ చైతన్యతో వెంకీ 'వెంకీ మామ' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కొన్ని నెలల గ్యాప్‌లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండూ కాక మరో కొత్త ప్రాజెక్టుపై వెంకీ తాజాగా సైన్ చేశాడు. అదే నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి సంబంధించి ఫ్రెష్ అప్‌డేట్ ఏంటంటే, తమిళ హీరో సూర్య ఈ సినిమాలో నటిస్తున్నాడట.
సూర్య నటించిన తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాలు అందుకున్న కారణంగా ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న మాట వాస్తవమే. కానీ ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించింది లేదింతవరకూ. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చిందనిపిస్తోంది. వెంకీ సినిమాలో సూర్య నటించడం నిజమే అయితే సూర్య అభిమానులకు ఆ కోరిక తీరిపోయినట్లే. అయితే సూర్య పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో రన్ అవుతుందట. నిడివి చాలా తక్కువ ఉన్న పాత్రట. కానీ చాలా పవర్‌ఫుల్ పాత్రనీ తెలుస్తోంది.
ఏది ఏమైనా ఈ రకంగానైనా ఇన్నాళ్లకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలో సూర్య కనిపించబోతున్నాడన్న మాటే.